సింగారమొలికిస్తూ సమ్మోహనపరిచే లఘు చిత్రం సింగార మోహన్
‘ఏ డేట్ ఇన్ ది డార్క్’
నాలుగ్గోడల మధ్య బంధిస్తే పిల్లి కూడా పులిలా మారుతుంది అన్నట్లు.. పరిమితులనే నాలుగ్గోడల మధ్య బందీ అయిన సృజనాత్మకత సరి కొత్త పుంతలు తొక్కుతుంది అని చెప్పడానికి తాజా ఉదాహరణ ‘సింగార మోహన్’.
దర్శకుడవ్వాలన్నది ఈ కుర్రాడి కల. కానీ ఇంట్లో సిట్యుయేషన్ సహకరించని పరిస్థితి. ఆ దిశగా ప్రయత్నాలు చేసేందుకు కనీసం హైదరాబాద్ వచ్చేందుకు కూడా వీలు కానీ వింత స్థితి. అయినా సరే.. తనలో ఉన్న ‘డైరెక్టర్ మెటీరియల్’ ను ఘనంగా ప్రకటించుకోవాలనే అతని వజ్ర సంకల్పానికి.. అతనిలో ఉన్న సృజనాత్మకత జత సాలిసింది.
తన మేధస్సే పెట్టుబడిగా.. జీరో బడ్జెట్ లో ‘డేట్ ఇన్ ది డార్క్’ అనే వర్చ్యువల్ ఆడియో షార్ట్ ఫిలిం రూపొందించి ‘ఎవరీ సింగార మోహన్’ అని అందరూ తనపై దృష్టి సారించేలా చేసుకున్నాడు.
ఆర్ధిక పరిస్థితులు అనుకూలించక ఇంజినీరింగ్ మధ్యలోనే డిస్కంటిన్యూ చేసిన మోహన్.. ప్రస్తుతం ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఫ్రీలాన్స్ వెబ్ డిజైనర్ గా పని చేస్తూ.. ‘ఈ లెర్నింగ్ ‘ కి సంబంధించిన స్టార్టప్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. కడప జిల్లా ‘కలసపాడు’ సింగార మోహన్ స్వస్థలం.
‘డేట్ ఇన్ ది డార్క్’ గురించి మోహన్ మాట్లాడుతూ… ‘2020లో ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ వెళ్లి.. ఫిలిం మేకర్ గా మారేందుకు ప్రయత్నాలు చేయాలి అని ఫిక్స్ అయి.. అందులో భాగంగా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ సొంతంగా తీసేందుకు సన్నాహాలు చేసుకుంటున్న తరుణంలో ‘కరోనా’ దాపురించింది. దాంతో.. కోవిడ్ నిబంధనలకు కట్టుబడి.. ఏ డేట్ ఇన్ ది డార్క్’ అనే వర్చ్యువల్ ఆడియో షార్ట్ ఫిలిం (వాస్తవిక శ్రవణ లఘు చిత్రం) తీశాను. అయితే దీనికి ఇంత గొప్ప స్పందన వస్తుందని ఊహించలేదు. ముఖ్యంగా ప్రముఖ లాయర్- యాక్టర్ జయశ్రీ రాచకొండ గారు ఈ షార్ట్ ఫిలింని ఎంతో మెచ్చుకుంటూ పేస్ బుక్ లో షేర్ చేశాక మరింత రీచ్ పెరిగింది’ అన్నారు.
ఈ షార్ట్ ఫిలిం కోసం వాయిస్ ఇచ్చి, జీవం పోసిన ద్రోణ శ్రీనివాస్, అలేఖ్య పట్వారీలకు మోహన్ కృతజ్ఞతలు తెలిపాడు. తిరుపతిలో ఉండే ద్రోణ శ్రీనివాస్, హైదరాబాద్ లో ఉండే అలేఖ్య పట్వారి ఇద్దరూ మెడికోస్ కావడం ఇక్కడ గమనార్హం. సుజీత్, శివ నిర్వాణ, ప్రశాంత్ వర్మ, సంకల్ప్ రెడ్డి వంటి నేటి లీడింగ్ దర్శకులంతా.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తమ టాలెంట్ నిరూపించుకున్నవాళ్ళేనని తెలిసిందే. పది నిమిషాల ‘ఏ డేట్ ఇన్ ది డార్క్’ చూసినవాళ్లంతా… పై జాబితాలో ‘సింగార మోహన్’ పేరు చేరడం ఖాయమనే అభిప్రాయంతో నిస్సంకోచంగా ఏకీభవిస్తారు!!