Movie News

పది వసంతాలు పూర్తిచేసుకున్న సుకుమార్‌ రైటింగ్స్‌

పుష్పా ఫ్రాంచైజీతో “ఆల్ టైం ఇండియన్ ఇండస్ట్రీ హిట్” స్థాయికి చేరిన దర్శకుడు సుకుమార్, తెలుగు రాష్ట్రాలకే కాకుండా జాతీయ స్థాయిలో కూడా కల్ట్ ఫిల్మ్ మేకర్‌గా గుర్తింపు పొందారు. అయితే తెలుగు ప్రేక్షకుల దృష్టిలో సుకుమార్ గొప్పతనం బాక్సాఫీస్ విజయాలకు, స్టార్‌డమ్‌కి మించి ఉంది. ఒకవైపు స్టార్‌ హీరోల చిత్రాలకు దర్శకత్వం వహిస్తూనే మరో వైపు సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌ ద్వారా క్రేజీ పాన్‌ ఇండియా చిత్రాలతో పాటు కొత్తదనంతో కూడిన వైవిధ్యమైన చిత్రాలను అందించడంలో కూడా సుకుమార్‌ గారు ముందంజలో ఉన్నారు.

ఇప్పటి వరకు ఈ పది వసంతాల కాలంలో సుకుమార్‌ రైటింగ్స్‌లో కుమారి 21F, ఉప్పెన, విరూపాక్ష, 18 పేజెస్, పుష్ప-2, గాంధీ తాత చెట్టు వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు అగ్ర నిర్మాణ సంస్థలతో నిర్మాణ భాగస్వామ్యంలో పాలు పంచుకుంటూ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై రూపొందాయి. ఈ సినిమాలు కొత్త ప్రతిభను పరిచయం చేయడంతో పాటు, తెలుగు సినిమాకి కొత్త ఊపును ఇచ్చాయి. ఈ ప్రయాణంలో అత్యంత ప్రతిష్టాత్మక విజయంగా నిలిచింది పుష్పా 2: ది రూల్. ఈ చిత్రం భారతదేశం మొత్తంలోనే కాకుండా విదేశాల్లో కూడా రికార్డులు బద్దలు కొట్టింది. బాక్సాఫీస్‌ను దాటి, ఇది ఒక సాంస్కృతిక ప్రభావాన్ని కలిగించిన చిత్రంగా నిలిచింది. ఇది సుకుమార్ సృజనాత్మకత ఎంతదాకా వెళ్తుందో స్పష్టంగా చూపించింది. అంతేకాదు సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌ నిర్మాణ విలువలు కూడా చాటిచెప్పింది

ఇప్పుడు భారతదేశం అంతా ఎదురు చూస్తున్న ప్రాజెక్టులలో ఒకటైన పెద్ది, గోబ్లల్‌ స్టార్‌ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కూడా సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ భాగస్వామ్యంలో తెరకెక్కుతోంది. అలాగే, యువ సామ్రాట్‌ నాగచైతన్య హీరోగా దర్శకుడు కార్తీక్ దండు రూపొందిస్తున్న తాజా చిత్రంలో కూడా సుకుమార్‌ రైటింగ్స్‌ భాగస్వామంగా ఉంది.

ప్రస్తుతం సుకుమార్ గ్లోబల్‌ స్టార్‌ రామ్ చరణ్‌తో తెరకెక్కే కొత్త చిత్రానికి స్క్రిప్ట్ సిద్ధం చేస్తూ, ప్రీ-విజువలైజేషన్ పనుల్లో నిమగ్నంగా ఉన్నారు. అంతేకాదు,ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు సుకుమార్‌ రైటింగ్‌ నిర్మాణ భాగస్వామ్యంగా కూడా ఉంది. సమాచారం ప్రకారం, ఇంకా ఆరు స్క్రిప్టులు నిర్మాణానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలు సుకుమార్‌ రైటింగ్స్‌పై తెరకెక్కడానికి సిద్దంగా ఉన్నాయి. ఈ ఆరు కథలు కూడా దేశవ్యాప్తంగా ప్రభావం చూపగల సామర్థ్యం కలిగి ఉన్నాయని పేర్కొంటున్నారు.

సుకుమార్ రైటింగ్స్ 10వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న సమయంలో, ఈ సంస్థ కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ, యూనివర్శల్‌గా అందరిని మెప్పించే భావోద్వేగపూరిత కథలు చెబుతూ తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించే దిశలో ఉంది.