Movie News

దీపావళికి నవ్వుల టపాసులు పేల్చనున్న ‘మిత్ర మండలి’

పండుగ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ప్రేక్షకులు థియేటర్లలో నవ్వులతో నిండిన దీపావళి పండుగను జరుపుకునేలా.. ‘మిత్ర మండలి’ చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

టీజర్‌తో ఆసక్తిని రేకెత్తించి, రెండు చార్ట్‌బస్టర్ పాటలతో అభిమానులను అలరించిన తర్వాత, నిర్మాతలు ఇప్పుడు ఆకట్టుకునే విడుదల తేదీ పోస్టర్‌తో పాటు ఒక వినోదభరితమైన ప్రకటన వీడియోను ఆవిష్కరించారు. బాణసంచా కాల్చడం మరియు గ్యాంగ్ యొక్క ఉత్సాహభరితమైన శక్తితో నిండిన ఈ పోస్టర్ పండుగ వాతావరణాన్ని నెలకొల్పింది. ఇక ప్రకటన వీడియో అయితే నవ్వులు పూయిస్తూ సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. ప్రేక్షకులకు ఎంతగానో ఎదురుచూస్తున్న నవ్వుల పండుగకు నమూనా అన్నట్టుగా ఈ వీడియో ఉంది.

ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ స్థాపించిన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘మిత్ర మండలి’ చిత్రం హాస్యం, రహస్యం, యవ్వన శక్తి మిశ్రమంగా ప్రేక్షకులకు అపరిమిత వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతోంది. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం., విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీరు వెండితెరపై నవ్వుల టపాసులు పేల్చబోతున్నారు. 

అభిరుచి గల నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాతగా సోమరాజు పెన్మెత్స వ్యవహరిస్తున్నారు. 

‘మిత్ర మండలి’కి అద్భుతమైన సాంకేతిక బృందం పని చేస్తోంది. ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా సిద్ధార్థ్ ఎస్.జె, ఎడిటర్ గా పీకే, కళా దర్శకుడిగా గాంధీ నడికుడికర్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా శిల్పా టంగుటూరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా రాజీవ్ కుమార్ రామా వ్యవహరిస్తున్నారు.

ప్రీ-లుక్ పోస్టర్ నుండి టైటిల్ ప్రకటన, టీజర్, పాటలు వరకు.. ‘మిత్ర మండలి’ నుండి విడుదలైన ప్రతిదీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలు ఏర్పడేలా చేసింది. ఇక ఇప్పుడు దీపావళి కానుకగా అక్టోబర్ 16న ఈ చిత్రం థియేటర్లలో అడుగు పెట్టనుందని తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్, వీడియో కూడా మెప్పించి అంచనాలను రెట్టింపు చేశాయి. 

‘మిత్ర మండలి’ అనేది స్నేహం ప్రధానంగా నడిచే కథ. బాధలన్నీ మర్చిపోయి, థియేటర్లలో మనస్ఫూర్తిగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది.

ఈ దీపావళికి వెండితెరపై సరదా, గందరగోళం మరియు స్నేహం యొక్క పటాకును చూడటానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ‘మిత్ర మండలి’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఫన్ బాంబ్ లాగా విజృంభించడానికి వస్తోంది.