Friday, September 5, 2025
HomeMovie Newsతెలుగు ప్రేక్షకులకు కృతఙ్ఞతలు:దుల్కర్ సల్మాన్

తెలుగు ప్రేక్షకులకు కృతఙ్ఞతలు:దుల్కర్ సల్మాన్

ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన మలయాళ చిత్రం ‘లోకా చాప్టర్ 1: చంద్ర’. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్, నస్లెన్ కె. గఫూర్ ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, ‘కొత్త లోక 1: చంద్ర’ పేరుతో విడుదల చేశారు. భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కొత్త లోక 1: చంద్ర’.. కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. భారీ వసూళ్ళను రాబడుతూ మలయాళ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మొదటి వారంలోనే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం హైదరాబాద్ లో చిత్ర విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు నాగ్ అశ్విన్, వెంకీ అట్లూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

- Advertisement -

ప్రముఖ కథానాయకుడు, చిత్ర నిర్మాత దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. “వేఫేరర్ ఫిలిమ్స్ బ్యానర్ పై మేము ఏడు సినిమాలు నిర్మించాము. కొత్త లోక కోసం ఇంత మంచి టీంతో పనిచేయడం సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ సినిమా కోసం మనసుపెట్టి పనిచేశారు. ఉత్తమ నటీనటులు, ఉత్తమ సాంకేతిక నిపుణుల మద్దతుతోనే ఇంత గొప్ప సినిమా చేయగలిగాము. నిర్మాతగా నేను వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చాను. షూటింగ్ కి మహా అయితే ఒక్కసారి వెళ్ళి ఉంటాను. అంతలా నేను టీంని నమ్మాను. సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవి నాకు మంచి స్నేహితుడు. అతని వల్లే ఈ కథ నా దగ్గరకు వచ్చింది. కథ వినగానే నిర్మించడానికి ముందుకొచ్చాను. ఈ సినిమా బడ్జెట్ తక్కువని మీరు అనుకోవచ్చు. కానీ, మలయాళ పరిశ్రమలో ఈ బడ్జెట్ చాలా ఎక్కువ. అయితే నేను బడ్జెట్ ఇవన్నీ ఆలోచించలేదు. అందరూ తమ డ్రీమ్ లా ఈ సినిమా కోసం పని చేశారు. మేము ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయలేదు. అదంతా ఇలాంటి అద్భుతమైన టీం వల్లే సాధ్యమైంది. డైరెక్టర్, డీఓపీ మధ్య బాండింగ్ బాగుంటే మంచి సినిమాలు చేయొచ్చు. డొమినిక్ అరుణ్, నిమిష్ రవి కలిసి అది నిజమని మరోసారి నిరూపించారు. మా సినిమాని తెలుగులో విడుదల చేసిన నాగవంశీ గారికి కృతఙ్ఞతలు. కళ్యాణి ప్రియదర్శన్ నాకు చెల్లి లాంటిది. మేమిద్దరం ఒకేలా ఉంటాము, ఒకేలా ఆలోచిస్తాము. చంద్ర పాత్ర కోసం కళ్యాణి తప్ప మా మైండ్ లోకి వేరే ఎవరి పేరు రాలేదు. కొత్త లోక సినిమాని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతఙ్ఞతలు. నన్ను ఎలాగైతే మీ వాడిగా భావించారో, అలాగే కొత్త లోకను కూడా మీ సినిమాగా భావించి ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.” అన్నారు. 

ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. “ఒకసారి కళ్యాణి ప్రియదర్శన్ చెన్నైలో కలిసినప్పుడు.. మలయాళంలో ఒక చిన్న చిత్రం చేస్తున్నాను అని చెప్పింది. కట్ చేస్తే, ఇప్పుడు వంద కోట్ల పోస్టర్ తో ఇండియాలోనే బిగ్గెస్ట్ థింగ్ అయింది. చెన్నైలో నేను మొదటిరోజు మొదటి షో చూశాను. సినిమా చాలా బాగుంది. రచన అద్భుతంగా ఉంది. సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. నిమిష్ రవి, జేక్స్ బెజోయ్ అద్భుతమైన పరితీరు కనబరిచారు. ఇలాంటి మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఇప్పటికే తెలుగులో మంచి స్పందన వస్తోంది. తెలుగు ప్రేక్షకులు మరింతగా ఆదరిస్తారని నమ్ముతున్నాను. అందరిలాగే నేను కూడా రెండవ భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. దుల్కర్ సల్మాన్ గురించి చెప్పాలంటే.. కేవలం సినిమా మీద ప్రేమతోనే అప్పుడు మహానటి సినిమాలో నటించారు. ఇప్పుడు అదే ప్రేమతో 30 కోట్లతో ఈ సూపర్ హీరో ఫిల్మ్ ని నిర్మించారు.” అన్నారు.

ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. “సినిమా నేను చూశాను. నాకు చాలా నచ్చింది. టెక్నికల్ గా బ్రిలియంట్ మూవీ. 30 కోట్లతో 300 కోట్ల రేంజ్ సినిమా తీశారని అందరూ అంటున్నారు. ఈ సినిమా ప్రారంభించినప్పుడు మలయాళ సినిమా పరంగా 30 కోట్లు అనేది చాలా ఎక్కువ. ఈ సినిమాని నమ్మి నిర్మాతగా ధైర్యం చేసిన దుల్కర్ సల్మాన్ గారిని ముందుగా అభినందించాలి. అలాగే సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవి, ఆర్ట్ డైరెక్టర్ బంగ్లాన్ లను ప్రత్యేకంగా అభినందించాలి. మలయాళం పరిశ్రమలో అందరూ గొప్పగా నటిస్తారు. సినిమాలో ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. కళ్యాణి ప్రియదర్శన్ గొప్పగా నటించింది. తాను నాకు తెలుసని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. యాక్షన్ సన్నివేశాలు తను చేసిన తీరుకి హ్యాట్సాఫ్. రచన అద్భుతంగా ఉంది. ఈ సినిమా ఇంత గొప్పగా మలిచిన దర్శకుడు డొమినిక్ అరుణ్ ప్రతి ప్రశంసకు అర్హుడు. నాగవంశీ గారు ఈ సినిమాతో విజయం సాధించడం ఆనందంగా ఉంది.” అన్నారు. 

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “ఈ సినిమా టీజర్ చూసి తెలుగులో నేనే విడుదల చేయాలి అనుకున్నాను. ఇలాంటి సూపర్ హీరో సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడం సంతోషంగా ఉంది. తెలుగు ప్రేక్షకుల ముందుకు ఒక మంచి చిత్రం వచ్చింది. ఖచ్చితంగా థియేటర్లలో చూసి అనుభూతి చెందాల్సిన సినిమా ఇది. తెలుగు ప్రేక్షకులు పెద్ద విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను.” అన్నారు.

చిత్ర కథానాయిక కళ్యాణి ప్రియదర్శన్ మాట్లాడుతూ.. “నాకు ప్రేమ చూపించిన మొదటి ప్రేక్షకులు తెలుగువారే. అది నేను ఎప్పటికీ మరచిపోను. ఇన్నిరోజులు తరువాత మళ్ళీ మిమ్మల్ని కలవడం, మీ ప్రేమ పొందడం చాలా ఆనందాన్ని ఇస్తోంది. సరైన కథలు వస్తే నాకు తెలుగులో చాలా సినిమాలు చేయాలని ఉంది. కొత్తలోక సినిమాని తెలుగు సినిమాలా భావించి ఆదరిస్తున్నారు. మీరు చూపిస్తున్న ఈ ప్రేమే మాకు బలం. మీ మద్దతుతో ఇలాంటి గొప్ప సినిమాలు మరిన్ని వస్తాయి. మాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు పెద్ద థాంక్యూ.” అన్నారు. 

చిత్ర కథానాయకుడు నస్లెన్ కె. గఫూర్ మాట్లాడుతూ.. “నేను హైదరాబాద్ కి రావడం ఇది మూడోసారి. ఈరోజు మీ అందరితో ఇక్కడ ఉండటం చాలా సంతోషముగా ఉంది. కొత్తలోక సినిమా పట్ల ప్రేక్షకుల చూపిస్తున్న ప్రేమ గురించి మాట్లాడటానికి నాకు మాటలు కూడా సరిపోవట్లేదు. దుల్కర్ సల్మాన్ గారు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. తెలుగులో మా సినిమాని విడుదల చేసిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ గారికి ధన్యవాదాలు. కళ్యాణి ప్రియదర్శన్ కలిసి నటించడం ఆనందంగా ఉంది.” అన్నారు.

చిత్ర దర్శకుడు డొమినిక్ అరుణ్.. “ఈ స్థాయి స్పందన అసలు ఊహించలేదు. మొదట ఒక చిన్న సినిమాగా ప్రారంభించాము. మంచి టీంతో ఒక గొప్ప సినిమాగా రూపొందింది. ఏ దర్శకుడికైనా ఇదొక పెద్ద కల లాంటిది. ఈ సినిమాని తమ సినిమాగా భావించి ప్రాణం పెట్టి పని చేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. నేను చెప్పిన ఈ కథని నమ్మి, ఈ సినిమాని నిర్మించిన దుల్కర్ సల్మాన్ గారికి ఎంతగా కృతఙ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. తెలుగులో మా సినిమాని భారీస్థాయిలో విడుదల చేసిన నాగవంశీ గారికి ధన్యవాదాలు. తెలుగు ప్రేక్షకులు మా సినిమాపై కురిపిస్తున్న ప్రేమకు చాలా సంతోషంగా ఉంది.” అన్నారు.

సంగీత దర్శకుడు జేక్స్ బెజోయ్ మాట్లాడుతూ.. “టాక్సీవాలా నుంచి సరిపోదా శనివారం వరకు నేను పని చేసిన తెలుగు సినిమాల అనుభవంతోనే మలయాళంలో మాస్ ఎలిమెంట్స్ తో మ్యూజిక్ ఇవ్వగలుగుతున్నాను. మలయాళంలో చేసిన ఈ పాత్ బ్రేకింగ్ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది. ప్రేక్షకుల నుంచి లభిస్తున్న స్పందన చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది.” అన్నారు.

ప్రముఖ యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వైభవంగా జరిగిన ఈ వేడుకలో నటులు అరుణ్ కురియన్, చందు, ఛాయాగ్రాహకుడు నిమిష్ రవి, కళా దర్శకుడు బంగ్లాన్, రచయిత్రి శాంతి, గీత రచయిత రాంబాబు తదితరులు పాల్గొని ‘కొత్త లోక 1: చంద్ర’ చిత్ర విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సినిమాకి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలిపారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read