ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, సీనియర్ హీరో సుమన్, ప్రఖ్యాత రచయిత జె.కె.భారవి. ఈనెల (ఆగస్టు) 15న హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో ఒకేసారి ప్రారంభమై ప్రపంచ రికార్డు నెలకొల్పనున్న 15 సినిమాలకు సంబంధించిన వివరాలు తెలిపేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీరంతా సంఘీభావం తెలిపారు. ఈ 15 చిత్రాల్లో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సుమన్ ప్రకటించగా… ఈ 15 చిత్రాల్లో యండమూరి సినిమా మినహా మిగతా సినిమాలకు తాను స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్ గా వ్యవహరించి తగిన సలహాలు, సూచనలు ఇస్తానని జె.కె.భారవి పేర్కొన్నారు. రామసత్యనారాయణను చూసి తాను గర్వపడుతుంటానని రేలంగి తెలిపారు.
ఈ 15 చిత్రాలకు స్టూడియో పార్టనర్ గా ఉండే అవకాశం లభించడం గర్వంగా ఉందన్నారు కె.ఎల్. ఫిల్మ్ స్టూడియో అధినేత కొంతం లక్ష్మణ్. కెరీర్ బిగినింగ్ లొనే 12 నెలల్లో 13 సినిమాలు తీసి, విడుదల చేసి రికార్డు క్రియేట్ చేసిన తనకు…ఒకేసారి 15 సినిమాలు స్టార్ట్ చేసి, ఏడాదిలోపు పూర్తి చేసి విడుదల చేయడం ఎంతమాత్రం కష్టసాధ్యం కాదని తుమ్మలపల్లి రామసత్యనారాయణ అన్నారు. ఈ 15 సినిమాల్లో యండమూరి వీరేంద్రనాధ్ వంటి మహా రచయిత చిత్రంతోపాటు జె.కె.భారవి వంటి మహాజ్ఞాని చిత్రం ప్రఖ్యాత దర్శకుడు ఓం సాయి ప్రకాష్ చిత్రం ఉండడం చాలా గర్వంగా ఉందని తుమ్మలపల్లి చెప్పారు. ఈ 15 చిత్రాల్లో కేవలం రెండుమూడు చిత్రాలు ప్రజాదరణకు నోచుకున్నా తాను పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేస్తుందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో…15 చిత్రాల దర్శకుల్లో పన్నెండు మంది హాజరై రామసత్యనారాయణ గారు ఇస్తున్న ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రాణం పెట్టి పనిచేస్తామని ప్రతిన పూనారు.ఈ 15 చిత్రాలకు “పి.ఆర్.ఓ” అయిన సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ అప్పాజీ కూడా పాల్గొన్నారు.