సినిమా వార్తలు

ఇకపై నా జీవితం ఈ “డైరెక్షన్”లో మాత్రమే!!

-సాఫ్ట్వేర్ ఇంజినీర్ టర్నడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శ్రీకాంత్ “శ్రీ” అప్పలరాజు “

రెండు పడవల ప్రయాణం నావరకు సరిపడదని నాకనిపించింది. అందుకే నాకు ఎంతో ఇష్టమైన సినిమా రంగంపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నాను” అంటున్నారు బహుముఖ ప్రతిభాశాలి శ్రీకాంత్ “శ్రీ” అప్పలరాజు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా తిరుగులేని ట్రాక్ రికార్డ్ కలిగి, సుప్రసిద్ధ బహుళ జాతి సంస్థల్లో విదేశాల్లోనూ పని చేసిన అనుభవం కలిగిన శ్రీకాంత్… “చీమ – ప్రేమ – మధ్యలో భామ!” (‘The Ant – The Love – and The Girl in between’) చిత్రంతో దర్శకుడిగా మారి, తొలి చిత్రంతోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు గెలుచుకుని తన ప్రతిభను ప్రకటించుకున్నారు. “మాగ్నం ఓపస్ ఫిల్మ్స్” పతాకంపై రూపొందిన ఈ వినూత్న ప్రేమకథా చిత్రం… అమెరికా, కెనడా, ఫ్రాన్స్, లండన్ తదితర దేశాల ఫిల్మ్ ఫెస్టివల్స్ లో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డులు గెలుచుకుంది.

చిన్నప్పటి నుంచి సంగీత, సాహిత్యాలలో అభినివేశం కలిగి… కవితలు, కథలు రాసి మెప్పిస్తుండేవారు. ఇంజినీరింగ్ పట్టభద్రులైన శ్రీకాంత్… బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లోనూ మాస్టర్స్ చేసి, న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుంచి డైరెక్షన్ కోర్స్ పూర్తి చేశారు. సినిమా రంగంలోకి ప్రవేశించే ముందు… కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసి, ఫిల్మ్ మేకింగ్ పట్ల పరిపూర్ణమైన అవగాహన కలిగించుకున్నారు. “మై కౌబాయ్, ఎందుకిలా, టేక్ ఇట్ ఈజీ” తదితర షార్ట్ ఫిల్మ్స్ శ్రీకాంత్ లోని స్పార్క్ నెస్ కు అద్దం పట్టి… ఆయనకు “చీమ ప్రేమ మధ్యలో భామ” చిత్రానికి మెగాఫోన్ పట్టే అవకాశం తెచ్చిపెట్టాయి. “శ్రీకాంతరంగం” పేరుతో తను వ్రాసుకున్న పుస్తకంలో తన అంతరంగాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించుకున్న ఈ సాఫ్ట్వేర్ ఇంజినీర్ టర్నెడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్… త్వరలో తన ద్వితీయ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సమాయత్తమవుతూనే, తన మూడో చిత్రం కోసం కూడా సన్నాహాలు చేసుకుంటున్నారు.

రాజమౌళి, సంజయ్ లీలా భన్సాలీ, జేమ్స్ కామెరూన్ తన అభిమాన దర్శకులని వినయంగా చెప్పుకునే ఈ విద్యాధికుడు… తనదైన శైలిలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు. తన చిత్రానికి గాత్రం అందించిన గాన గంధర్వుడు శ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తమ సినిమా చూసి… తమ చిత్ర బృందాన్ని మెచ్చుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతారు శ్రీకాంత్!!