రాగ్ మయూర్ హీరోగా, డిజే టిల్లు ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అనుమాన పక్షి’. చిలకా ప్రొడక్షన్స్ పై రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. భరత్ లక్ష్మీపతి సహనిర్మాత.
సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. తాజాగా కశ్మీర్‌లోని పహల్గామ్, శ్రీనగర్ ప్రాంతాల్లో కీలకమైన షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో అక్కడ జరిగిన దుర్ఘటన తర్వాత మళ్లీ పహల్గామ్‌లో షూట్ చేసిన తొలి సినిమా ఇది.
సీఆర్పీఎఫ్ మార్గదర్శకత్వంలో, అన్ని భద్రతా నియమాలు పాటిస్తూ 20 రోజుల పాటు ఇంటెన్స్ షెడ్యూల్ షూట్ చేశారు. ఈ షెడ్యూల్‌తో సినిమాకి దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయింది. నవంబర్ చివర్లో తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇటివలే విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించగా, సునీల్ కుమార్ నామా సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు.
ప్రిన్స్ సెసిల్, అనన్య, చారిత్ కీలక పాత్రల్లో కనిపించగా, బ్రహ్మాజీ, అజయ్, సీనియర్ నటి రాశి యూనిక్ రోల్స్‌లో కనిపించనున్నారు.
విభిన్న కథతో, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కుతున్న “అనుమానపక్షి” త్వరలో థియేటర్లలోకి రానుంది.