బాలయ్య సినిమాకు , ప్రభుత్వాలకు నోటీసులు!

కొన్నాళ్ల కిందటి బాలయ్య సినిమా ‘గౌతమి పుత్రశాతకర్ణి’కు అనుకోని ఝలక్ తగిలింది. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పన్ను రాయితీ పొందిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు కోర్టు నోటీసులు జారీ అయ్యాయి. ఈ సినిమాకు అటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు ఏపీ ప్రభుత్వం పోటాపోటీ రాయితీలు ఇచ్చాయి. ఈ సినిమా  తెలుగు వారి చరిత్రకు సంబంధించిన సినిమా అని మినహాయింపును ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం అయితే తనే మెచ్చి మినహాయింపును ఇచ్చింది.

అయితే రుద్రమదేవి వంటి సినిమాకు మినహాయింపును ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం బాలయ్య సినిమాకు మాత్రం మినహాయింపును ఇవ్వడం పట్ల తీవ్ర విమర్శలు వచ్చాయి. బాలయ్య తెలుగుదేశం ఎమ్మెల్యే, చంద్రబాబుకు వియ్యంకుడు అయినందు వల్లనే మినహాయింపును ఇచ్చారనే ప్రచారం జరిగింది.  ఈ విమర్శలు వచ్చినా బాబు ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు.

అదలా ఉంటే.. ఇలా పన్ను మినహాయింపు పొంది.. ఆ ప్రయోజనాలను సినిమా చూసే ప్రేక్షకులకు కలిగించలేదని ఈ సినిమాకు నోటీసులు జారీ అయ్యాయి. పన్ను మినహాయింపు అంటే అది నిర్మాత జేబుల్లోకి వెళ్లింది తప్ప.. మినహాయింపు వల్ల సినిమా చూసే జనాలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని హై కోర్టులో ఒక  పిటిషన్ దాఖలు అయ్యింది.

సాధారణంగా పన్ను మినహాయింపు పొందిన సినిమాల టికెట్ ధరలను ఆ మేరకు తగ్గించాలి. అయితే గౌతమిపుత్రశాతకర్ణికి అది జరగలేదని పిటిషనర్ పేర్కొన్నాడు. పన్ను మినహాయింపు పూర్తిగా నిర్మాతల జేబుల్లోకి వెళ్లిందని పేర్కొన్నాడు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరాడు. దీనిపై స్పందిస్తూ ఆ సినిమా నిర్మాతలకు, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకూ నోటీసులు జారీ అయినట్టుగా తెలుస్తోంది.